• Home »
  • రాజకీయాలు »
  • కొట్టుకోవ‌డం కోళ్ళ ల‌క్ష‌ణ‌మ‌ట: చింత‌మ‌నేని సూత్రీక‌ర‌ణ‌

కొట్టుకోవ‌డం కోళ్ళ ల‌క్ష‌ణ‌మ‌ట: చింత‌మ‌నేని సూత్రీక‌ర‌ణ‌

ఇళ్ళ‌ల్లో ఉన్న కోళ్ళు ఎదురెదురు ప‌డితే కొట్టుకోవా..దాన్ని కోడి పందెమంటామా. నోరు నొక్కుకునేలా చేసే ఈ వ్యాఖ్య ఘ‌న‌త వ‌హించిన ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర‌రావు గారి నోటి నుంచి వెలువ‌డింది. ఇందుకు ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల‌లోకి సుప్రీం కోర్టును కూడా లాగారు. సుప్రీం కోర్టు చెప్పింది క‌దా…కోడి పందాలు నిర్వ‌హిస్తున్నా ప‌ట్టుకోవ‌ద్దంటూ చెప్పింది క‌దా.. అన్నారు. య‌థా రాజా త‌థా ప్ర‌జా అన్న నానుడి గుర్తుకొస్తోందా. కొట్టుకోవ‌డం కోడి ల‌క్ష‌ణ‌మ‌ట‌. ఎదురు బొదురిళ్ళ‌లో ఉన్న కోళ్ళు ఎదుప‌డితే కొట్టుకుంటాయ‌ట‌. అప్పుడు మ‌నం చూస్తూ ఉంటామ‌ట‌. అది కోడి పందెమంటే ఎలాగా అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న త‌న మాట‌ల‌తోనే పోలీసుల‌కు అన్యాప‌దేశంగా హిత‌బోధ చేసేశార‌నిపించ‌డం లేదా. కోడిపందాలు జ‌రిగే చోటుకు వెళ్ళ‌ద్ద‌ని. కింద‌టేడాది కూడా నిషేధం ఉన్న‌ప్ప‌టికీ, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, స‌హా అనేక‌మంది రాజ‌కీయ నేత‌లు య‌థేచ్ఛ‌గా కోడిపందాల‌కు వెళ్ళారు. పందేలూ కాశారు.

చట్టాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంలోనూ.. త‌మ‌కు అనుకూలంగా మార్చేసుకోవ‌డంలోనూ.. త‌మ‌కు అనుగుణంగా అర్థం చెప్పుకోడంలోనూ టీడీపీ నేత‌ల‌ను మించిన వారు లేర‌ని మ‌రోసారి రుజువైపోయింది. క‌త్తులు క‌ట్ట‌ద్దు.. కోళ్ళ‌ను స్వాధీనం చేసుకోవ‌ద్దూ అంటే కోడి పందాలు వేసేసుకోమ‌ని సుప్రీం కోర్టు చెప్పిన‌ట్లా. మెడ‌కాయ మీద త‌ల‌కాయ ఉన్న‌వారెవ‌రికైనా ఇలా అర్థ‌మై ఉంటే అంత‌కు మించిన హాస్యోక్తి ఉండ‌దు. కాల్ మ‌నీ వంటి కిరాత‌క‌మైన కేసుల్నే అట‌కెక్కించేసిన వారికి కోడిపందేలు నిర్వ‌హించుకోవ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. సంస్కృతి ప్ర‌కారం కోడిపందాలతో ఆ మూడురోజులు ఆహ్లాదంగా గ‌డిపేవారు. పందాలు క‌ట్ట‌డం… కోట్ల‌కు కోట్లు చేతులు మారిపోవ‌డం…ఇప్పుడు సంస్కృతిలో భాగం చేసేశారు. సంప్ర‌దాయాన్ని మార్చేసి కొత్త‌ర్థం చెప్పేశారు. త‌హ‌శీల్దారు వ‌న‌జ‌పై బ‌హిరంగంగా దౌర్జ‌న్యం చేసిన కేసునే చింత‌మ‌నేని సద్దుమ‌ణిగించుకున్నారు. ఇప్పుడు మ‌న‌లాగే కోళ్ళ‌కు రెండు కాళ్ళు..త‌ల‌, కోపం ఉంటాయంటూ చెప్పారు చింత‌మ‌నేని. వినేవారు న‌వ్వుకుంటార‌నే ధ్యాస‌కూడా కొర‌వ‌డింది.

Video Credits: Nyusu Digital Media