జగన్ కు జనంతో పాటు వ్యూహమూ ముఖ్యమే.

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ రైతు భరోసా యాత్ర చేస్తుండడం సహజంగానే అదికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అంతగా రుచించదు. ఎపిలో ముఖ్యంగా రాయలసీమలో కరువు కారణంగా రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిశీలించడానికి, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించడానికి ఆయన ఈ యాత్ర చేస్తున్నారు.దీనిపై వ్యవసాయ మంత్రి పుల్లారావు తీవ్రంగా విమర్శిస్తూ రైతులను జగన్ రెచ్చగొడుతున్నారని, రైతుల ఆత్మహత్యలు ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువేనని అన్నారు.
1
అయితే 2014కన్నా 2015 లోరైతుల ఆత్మహత్యలు మూడు రెట్లుపెరగడం ఆందోళన కలిగించే అంశమే.జగన్ ఈ విషయాన్ని చెప్పడం అదికారంలోఉన్నవవారికి ఇబ్బందిగానే ఉంటుంది. కర్నూలు జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికై టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నియోజకవర్గమైన శ్రీశైలం లో ముందుగా ఆయన పర్యటించారు.జగన్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రభావం కన్నా జగన్ కు ఉన్న ఆదరణ ఎంత ఎక్కువగా ఉందో తేలిపోయింది.మరో రెండున్నర ఏళ్లలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు జగన్ సన్నద్దమవడానికి వీలుగా ఆయన ఈ పర్యటనలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. జనంలో తనకు పట్టు ఉందని రుజువు చేసుకోవడం ద్వారా పార్టీని చెక్కుచెదరకుండా ఉంచుకోగలుగుతున్నారు.అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం చేసే ఉపన్యాసాలకు జగన్ జవాబు ఇస్తున్నారు.చంద్రబాబు అబద్దాలు,మోసాలతో పాలన సాగిస్తున్నారని సోదాహరణంగా వివరించడానికి ఆయన ఈ పర్యటనలను వినియోగించుకుంటున్నారు.

images
రుణమాఫీకి సంబందించి చంద్రబాబు గతంలో చేసిన వాగ్దానం, ఆ తర్వాత జరిగిన పరిణామం,వడ్డీల భారం పెరిగి ,కుదువ పెట్టిన బంగారం ఇంటికి రానివైనం పై ఆయన విమర్శలు కురిపిస్తున్నారు. యువతకు ప్రతి ఇంటికి ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అన్న చంద్రబాబు ఎన్నికల మాట, ఆ తర్వాత దానిపై వాగ్దాన భంగం ఇలా అనేక విషయాలను జగన్ ప్రస్తావిస్తున్నారు.వీటికి సమాధానం లేని పరిస్థితిలో అదికార టిడిపి నేతలు వ్యక్తిగత విమర్శల దాడి చేయడానికి యత్నిస్తున్నారు.వాటిని జనం నమ్ముతారా లేదా అన్నది వేరే విషయం. జగన్ లో ఒక ప్రత్యేకత ఉంది.ఆయన నిత్యం మీడియా ముందు కనబడాలని అనుకోరు.ఉమ్మడి ఎపిలో చంద్రబాబు నాయుడు పదేళ్లపాటు విపక్ష నేతగా ఉన్నారు.ఆ కాలంలో దాదాపు ప్రతి రోజు లేదా అత్యధిక సార్లు ఆయనే మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై ఏవో విమర్శలు చేస్తుండేవారు.లేదా ఏదో ఒక లీకు ఇచ్చి వార్తలలో ఉంటుండేవారు.జగన్ అలా కాదు.తాను పర్యటనలు చేస్తేనే, ప్రజలలో ఉంటేనే మీడియాలో కనిపించడానికి ఇష్టపడుతున్నారు.అదే సమయంలో ఒకసారి భరోసా యాత్ర వంటివి పెట్టుకుంటే వారం రోజుల పాటు కొనసాగిస్తున్నారు.దీనివల్ల రాజకీయంగా ఎంత ఉపయోగం ఉంటుంది?ఎంత ఉండదన్నది చెప్పజాలం.

maxresdefault

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం జనంలో ఉండడం అంటే వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం అవుతుంది.స్థానిక నేతలకు కూడా ఒక్కెసారి ఇది భారం అవుతుంటుంది.వీటన్నిటిని గమనంలోకి తీసుకుని నేతలు యాత్రలు సాగిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. జగన్ కు ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్చందంగా తరలివస్తుండడం ఆయనకు కలిసి వచ్చే అంశం.జగన్ ప్రజలలో ఉంటే ,వారి సమస్యలపై దృష్టి పెడితే సరిపోతుందని అనుకుంటే మాత్రం కష్టమే కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఎన్నికల రాజకీయ రణ వ్యూహాలలో ఆరితేరినవాడు.ఆయన అదికారం కోసం ఎంతకైనా తగ్గగలరు. అదికారం వచ్చాక అంతకు ఎక్కువగా మారిపోగలరు.ఈ అంశాన్ని కూడా జగన్ గుర్తుంచుకోవలసి ఉంటుందన్న అభిప్రాయం లేకపోలేదు.జగన్ ఎక్కువసార్లు దేవుడే అన్ని చూసుకుంటాడన్న చందంగా మాట్లాడుతున్నారు.వర్తమాన రాజకీయాలలో దేవుడి పాత్ర చాలా తక్కువేనని చెప్పాలి. ఎందుకంటే దేవుడికి కూడా అంతుపట్టని విధంగా అనైతిక రాజకీయాలు సాగే ఈ రోజులలో ఆయన ప్రత్యర్ధులకు ధీటుగా వ్యూహాలు తయారు చేసుకోవడానికి సిద్దపడాలి.జనాదరణ తో పాటు వ్యూహం కూడా ముఖ్యమే.

By : Kommineni.

జగన్ రాజకీయ వ్యూహం ఎలా ఉంది అనేది రెండవ బాగం .